KTR: దావూద్ ఇబ్రహీం కంటే రేవంత్ రెడ్డి చాలా డేంజర్: కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు
- భారతదేశ పప్పు రాహుల్, తెలంగాణ పప్పు రేవంత్ అన్న కేటీఆర్
- రాహుల్ గాంధీ స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోవాలని సూచన
- కాళేశ్వరం అవినీతిమయం అంటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వ్యాఖ్య
- కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రేస్ ప్రభుత్వమని ఎద్దేవా
- రేటెంత రెడ్డిని పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ నీతులు చెప్పడం విడ్డూరమన్న కేటీఆర్
భారతదేశ పప్పు రాహుల్ గాంధీ అయితే తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీ తన స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోవాలన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్ కంటే డేంజర్ అని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం అవినీతిమయమని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. వీళ్లిద్దరు (రాహుల్, రేవంత్) ఎగేసుకొని కాళేశ్వరం చూద్దామని వెళ్లారని, ఇక వీళ్లు మహా ఇంజనీర్లు... అందుకే బ్రిడ్జి కూలిపోతుందని ప్రచారం చేస్తున్నారని చురకలు అంటించారు.
ఎక్స్‌పాక్షన్ జాయింట్‌ను చూపిస్తూ కాళేశ్వరం బ్రిడ్జి కూలిపోతుందని ఫోటోలు పెడుతున్నారని, ఇది వీళ్ల అవగాహన అని మండిపడ్డారు. రాష్ట్రానికి వరం కాళేశ్వరమైతే దేశానికి శనేశ్వరం కాంగ్రెస్ అన్నారు. రాహుల్ గాంధీకి చరిత్ర తెలవదని, తెలుసుకునే సోయి కూడా లేదన్నారు. స్క్రిప్ట్ రైటర్‌ను మార్చుకోవాలన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ పార్టీ చేయని కుంభకోణమంటూ ఉందా? అన్నారు. కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. ఆదర్శ్, బోఫోర్స్, కామన్వెల్త్, బొగ్గు ఇలా చెప్పుకుంటూ పోతే సహజ వనరులన్నీ దోచుకున్న దొంగలు అన్నారు. పంచ భూతాలను.. ఆకాశాన్ని, పాతాళాన్నీ మింగిన అవినీతి తిమింగలాలు అన్నారు.
కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రధాన మంత్రులు మీ పార్టీ వాళ్ళు అవినీతి ఆరోపణలతో జైల్లో ఊచలు లెక్కబెట్టారన్నారు. పార్టీ పేపర్ నేషనల్ హెరాల్డ్‌లో కూడా అవినీతికి పాల్పడి సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొన్న మీరు నీతి, నిజాయతీ అంటే జనం నవ్వుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి అలియాస్ రేటెంత రెడ్డిని పక్కన పెట్టుకొని రాహుల్ నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్, వోటుకు నోటు దొంగ అన్నారు. కాంగ్రెస్ టిక్కెట్లను అంగట్లో అమ్మినట్లు అమ్ముకున్నాడన్నారు.