Natti Kumar: సెన్సార్ రివైజింగ్ కమిటీ నుంచి జీవితను తప్పించండి: నట్టి కుమార్
- వర్మ 'వ్యూహం' చిత్రాన్ని తిరస్కరించిన ప్రాంతీయ సెన్సార్ బోర్డు
- రివైజింగ్ కమిటీ ముందుకు 'వ్యూహం'
- రివైజింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న జీవిత
- జీవిత గతంలో వైసీపీలో ఉన్నారని వెల్లడించిన నట్టి కుమార్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' చిత్రాన్ని ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఇటీవల తిరస్కరించింది. దాంతో ఈ చిత్రం సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ముందుకెళ్లింది. ఈ రివైజింగ్ కమిటీలో నటి జీవితా రాజశేఖర్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పుడామెను రివైజింగ్ కమిటీ నుంచి తప్పించాలని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'వ్యూహం' చిత్రం పూర్తిగా ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా తెరకెక్కించారని, ఇందులో చంద్రబాబు, సోనియా, పవన్ కల్యాణ్ ల డూప్ లను పెట్టి చిత్రీకరించారని నట్టి కుమార్ వివరించారు. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కోపతాపాలతో ఉన్నారని, ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో 'వ్యూహం' చిత్రం విడుదల ఏమంత మంచిది కాదని, ఏపీలో ఆగ్రహ జ్వాలలు నెలకొంటాయని, తెలంగాణలో కొన్ని పార్టీలపై అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు.
ప్రస్తుతం 'వ్యూహం' చిత్రం రివైజింగ్ కమిటీ ముందుకెళ్లిందని, ఆ కమిటీలో సభ్యురాలిగా ఉన్న జీవిత గతంలో వైసీపీ నేత అని, ప్రస్తుతం ఆమె బీజేపీ సెంట్రల్ కమిటీలో ఉన్నారని నట్టి కుమార్ వెల్లడించారు. వైసీపీతో ఆమెకు సంబంధాలు ఉంటాయని, అందువల్ల ఆమెపై రాజకీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆమె ఈ చిత్రానికి ఓకే చెబితే ప్రతిపక్షాలకు దెబ్బ తగులుతుందని అన్నారు.
అంతేకాకుండా, 'వ్యూహం' చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వైసీపీ నేత అని, జీవిత భర్త రాజశేఖర్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్నేహితుడు అని వివరించారు. ఈ కారణాలతో జీవితను సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ నుంచి తాత్కాలికంగా తొలగించాలని, కేవలం ఈ సినిమా వరకు మాత్రమే తొలగించాలని కోరుతున్నామని అన్నారు. ఈ మేరకు సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ చైర్మన్ ను ఉద్దేశించి నట్టి కుమార్ ఓ వీడియో విడుదల చేశారు.
'వ్యూహం' చిత్రాన్ని రివైజింగ్ కమిటీ సభ్యులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు కూడా చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇందులో రాజకీయ జోక్యం ఉండకూడదనే జీవితను తప్పించాలని కోరుతున్నామని వివరించారు.