Team India: ఆసియా కప్ ఫైనల్ రిపీటైంది... శ్రీలంక ఘోర ఓటమి.. వరల్డ్ కప్ సెమీస్ లోకి దూసుకెళ్లిన టీమిండియా
- వరల్డ్ కప్ లో టీమిండియా × శ్రీలంక
- మొదట 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసిన టీమిండియా
- 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలిన లంక
- 302 పరుగులతో భారీ విజయం సాధించిన రోహిత్ సేన
- మహ్మద్ షమీకి 5 వికెట్లు... 3 వికెట్లు సాధించిన సిరాజ్
సెప్టెంబరు 17న జరిగిన ఆసియా కప్ ఫైనల్ ఎలా జరిగిందో, ఇవాళ టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ కూడా అలాగే జరిగింది. అయితే కొద్దిగా తేడా!... అదేంటంటే... ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలగా, టీమిండియా ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. నేడు వరల్డ్ కప్ లో టీమిండియా ముందు బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేయగా, శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది... అంతే!
ఈ విజయంతో టీమిండియా వరల్డ్ కప్ సెమీస్ లోకి సగర్వగంగా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి పట్టికలో అగ్రస్థానాన్ని అలంకరించింది.
నేటి మ్యాచ్ విషయానికొస్తే... 358 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక చివరికి 302 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకుంది. పునరాగనం తర్వాత మహ్మద్ షమీ వరుసగా మూడో మ్యాచ్ లోనూ నిప్పులు చెరిగే ప్రదర్శనతో అదరగొట్టాడు. 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీసిన షమీ లంక వెన్నువిరిచాడు. సిరాజ్ 3 వికెట్లతో కొట్టిన దెబ్బ నుంచి తేరుకునే లోపే షమీ పిడుగులా వచ్చి పడ్డాడు. దాంతో లంక బ్యాటర్లు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే టాపార్డర్ అంతా పెవిలియన్ కు చేరింది.
ఏంజెలో మాథ్యూస్ (12), తీక్షణ (12 నాటౌట్), కసున్ రజిత (14) కాస్త పోరాడడంతో వన్డేల్లో అత్యల్ప స్కోరు (35) రికార్డు తప్పిపోయింది. లేకపోతే లంక ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకుని ఉండేది.
లంక జట్టులో ఐదుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టీమిండియా బౌలర్లలో షమీ 5, సిరాజ్ 3, బుమ్రా 1, జడేజా 1 వికెట్ తీశారు. టీమిండియా వరల్డ్ కప్ లో తన తదుపరి మ్యాచ్ ను దక్షిణాఫ్రికాతో ఈ నెల 5న ఆడనుంది. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదిక. ఆ తర్వాత తన చివరి లీగ్ మ్యాచ్ ను రోహిత్ సేన... నెదర్లాండ్స్ లో ఈ నెల 12న బెంగళూరులో ఆడనుంది.
నవంబరు 15, 16 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబరు 19న ఫైనల్ నిర్వహించనున్నారు.