Cricket: 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో బుమ్రా కొత్త రికార్డ్
- ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన భారతీయ బౌలర్‌గా గుర్తింపు
- శ్రీలంక ఓపెనర్ నిస్సంకను ఔట్ చేయడం ద్వారా ఘనత
- లంక ఆటగాళ్లను పదునైన బంతులతో భయపెట్టిన బుమ్రా
ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత బౌలర్లు చెలరేగారు. మహ్మద్ షమీ 5 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసి లంకను షాక్‌కు గురిచేశాడు. పదునైన బంతులతో లంక ఆటగాళ్లను భయపెట్టాడు. నిస్సంకను ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవీలియన్‌కు పంపించాడు. బంతి వేగంగా వెళ్లి నిస్సంక ప్యాడ్స్‌ను తాకింది. ఔట్‌గా అంపైర్ ప్రకటించినప్పటికీ శ్రీలంక రివ్యూ తీసుకుంది. రివ్యూలో కూడా ఔట్‌గా తేలడంతో నిస్సంకా వెనుదిరిగాడు. దీంతో 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. క్రికెట్ ప్రపంచకప్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన మొదటి భారత బౌలర్‌గా ఘనత దక్కించుకున్నాడు. ఇదివరకు ఏ భారత బౌలర్ వరల్డ్ కప్‌లో తొలి బంతికే వికెట్ తీయలేదు. దీంతో బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది.
ఇదిలావుండగా శ్రీలంకపై మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేయలేకపోయాడు. సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేస్తాడని భావించినా నిరాశే ఎదురైంది. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఏకంగా 189 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విరాట్ 94 బంతుల్లో 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో సచిన్ రికార్డ్ కోసం మరో మ్యాచ్ కోసం ఎదురుచూడాల్సి ఉంది.