Talasani: హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్
- హైదరాబాద్ అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోందన్న మంత్రి తలసాని
- బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి
- బీఆర్ఎస్ పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఐటీ అభివృద్ధి జరిగిందన్న మంత్రి
హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోందని, బీఆర్ఎస్‌కు ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ అంటే అభివృద్ధికి మారుపేరుగా నిలిచిందన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణను బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ పాత్ర ఎంతో ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి లక్షలాదిమంది ఇక్కడ హాయిగా బతుకుతున్నారన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకు వచ్చిందన్నారు. ఐటీ రంగంలోనూ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కరోనా కాలంలో వలస కార్మికులను తమ ప్రభుత్వం ఆదుకుందన్నారు. దేశంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు.
అలాగే రాష్ట్రంలో పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఆడపిల్ల పెళ్లికి అండగా నిలుస్తోన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర సర్కార్ చిన్న చూపు చూస్తున్నదన్నారు. అయినప్పటికీ తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అద్భుత కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.