Harish Rao: తెలంగాణ వ్యతిరేకులతో రేవంత్ రెడ్డి దోస్తానా చేస్తున్నారు... ద్రోహులంతా ఏకమవుతున్నారు: హరీశ్ రావు
- సంగారెడ్డి కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు
- తెలంగాణ మరోసారి గెలవాలంటే కేసీఆర్వైపు నిలబడాలన్న హరీశ్ రావు
- ఓటుకు నోటు కేసులో దొరికిన అసలైన క్రిమినల్ రేవంత్ రెడ్డి అన్న మంత్రి
- రేవంత్ రెడ్డి పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని ఆ పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారని మండిపాటు
టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకులతో దోస్తానా చేస్తున్నారు అంటూ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాకుండా కుట్రలు చేసినవాళ్లందరూ ఇప్పుడు ఒక్కటయ్యారన్నారు. తెలంగాణను దెబ్బతీసేందుకు ద్రోహులంతా ఏకమవుతున్నారన్నారు. తెలంగాణ మరోసారి గెలవాలంటే కేసీఆర్ వైపు మళ్లీ నిలబడాలన్నారు.
ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లింది ఎవరు? ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది ఎవరు? అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నిలదీశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన అసలైన క్రిమినల్ టీపీసీసీ అధ్యక్షుడు అన్నారు.
రేవంత్ రెడ్డి పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ వారే చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను కూడా అమ్మేస్తారని విమర్శించారు. సీట్లు రాని వాళ్లు గాంధీ భవన్లో గొడవ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇప్పటికే కర్ణాటక ప్రజలు మోసపోయారని, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రిస్క్ తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్ గెలిస్తే కొట్లాటలు, కర్ఫ్యూలు ఉంటాయన్నారు.
అభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా తెలంగాణ మారిందన్నారు. కేసీఆర్ హయాంలో తాగునీటికి, కరెంటుకు కొరత లేదన్నారు. ఆడపిల్ల పెళ్లికి అడ్డంకులు లేవన్నారు. ఆసరా పెన్షన్ను తాము రూ.5 వేలు చేయనున్నట్లు చెప్పారు. రేషన్ దుకాణాల్లో ఇక నుంచి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం మళ్లీ వచ్చాక గ్యాస్ సిలిండర్ ధరను కేవలం రూ.400కే ఇస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మి కింద ప్రతి పేద మహిళకు రూ.3వేలు అందిస్తామన్నారు.