Afghanistan: ఓ రేంజిలో ఆడిన ఆఫ్ఘనిస్థాన్... లక్నోలో నెదర్లాండ్స్ విలవిల
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్
- 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్
- నబీకి 3, నూర్ అహ్మద్ కు 2 వికెట్లు
- డచ్ ఇన్నింగ్స్ లో నలుగురు రనౌట్
- స్పిన్, ఫీల్డింగ్ తో అల్లాడిన ఆఫ్ఘన్లు
వరల్డ్ కప్ లో ఇవాళ ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. లక్నోలో జరుగుతున్న ఈ పోరులో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు, ఫీల్డర్లు స్ఫూర్తిదాయకమైన ఆట ప్రదర్శించడంతో నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌట్ అయింది.
సీనియర్ ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ నబీ 3 వికెట్లు తీయగా, యువ చైనామన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసి సత్తా చాటాడు. ముజీబుర్ రెహ్మాన్ కు 1 వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ ఫీల్డింగ్ ఓ రేంజిలో ఉందని చెప్పాలి. ఏకంగా నలుగురు నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్ ను వారు రనౌట్ చేశారు. డచ్ జట్టులో సైబ్రాండ్ ఎంగెల్ బ్రెక్ట్ 58, ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ 42, కొలిన్ అకెర్మన్ 29 పరుగులు చేశారు. ఈ ముగ్గురినీ ఆఫ్ఘన్ ఫీల్డర్లు రనౌట్ రూపంలో తిప్పిపంపడం విశేషం. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ సైతం ఆడిన తొలి బంతికే రనౌట్ అయ్యాడంటే ఆఫ్ఘన్ ఫీల్డింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.