karumuri nageswara rao: కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ప్రశ్నల వర్షం
- ఓట్ల కోసం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారని మంత్రి కారుమూరి ఆగ్రహం
- కరోనా సమయంలో కేసీఆర్ ప్రజలను గాలికి వదిలేశారని ఆరోపణ
- తెలంగాణలో ఏపీ సన్నబియ్యం తింటున్నారన్న మంత్రి కారుమూరి
- చిన్న వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్న
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో ఏపీ, తెలంగాణలను పోల్చుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు.
ఓట్లకోసం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఏపీ గురించి కేసీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, కానీ కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేయని మేలు ఏపీలో చేశామన్నారు. కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ ప్రజలను గాలికి వదిలేశారని, ఏపీలో ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేశామన్నారు.
ఏపీ ధాన్యం తెలంగాణలో అమ్ముతున్నారని కేసీఆర్ చెబుతున్నారని, కానీ ఏపీలో తాము ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని అన్నారు. ఏపీలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని కేసీఆర్ అసత్యాలు చెబుతున్నారన్నారు. ఇంటింటికి వెళ్లి బియ్యం ఇస్తున్నామని, తెలంగాణలో వారు మామూలు బియ్యం ఇస్తుంటే మేం సర్టెక్స్ బియ్యం ఇస్తున్నామన్నారు. ఏపీలో ఉత్పత్తి అయ్యే సన్నబియ్యాన్ని తెలంగాణలో తినడం లేదా అని నిలదీశారు. మేం ఇక్కడ ప్రజలకు ఇస్తున్న సరుకులు మీరు తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.
కేసీఆర్ దాదాపు పదేళ్లుగా సీఎంగా ఉంటున్నారని, కానీ చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఏపీలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తున్నారా? అని నిలదీశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్‌ను తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికలు వస్తే కేసీఆర్ అక్కడే రాజకీయాలు చేసుకోవాలని, కానీ ఏపీని విమర్శించడం విడ్డూరమన్నారు.