Cricket: టీమిండియా బౌలర్లు ఉపయోగిస్తున్న బంతులపై దర్యాప్తు చేయాలి: పాక్ మాజీ క్రికెటర్ డిమాండ్
- రెండో ఇన్నింగ్స్‌లో బంతి మారుతోందని అనుమానం
- భారత్ చక్కగా బ్యాటింగ్ చేసిన చోట ప్రత్యర్థులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపణ
- భారత్ వాడే బంతులను తనిఖీ చేయాలని ఐసీసీకి సూచన
భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2023లో టీమిండియా బౌలర్లు ఉపయోగిస్తున్న బంతులపై దర్యాప్తు చేయాలని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ హసన్ రజా డిమాండ్ చేశాడు. ఈ మేరకు పరిశీలన చేపట్టాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ని (ICC) కోరాడు. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వారి బ్యాట్స్‌మెన్ బాగా ఆడుతున్నారని, కానీ టీమిండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇతర జట్లు ఇబ్బంది పడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశాడు. ఇలా ఎలా జరుగుతోందో అర్థంకావడంలేదని ఆరోపించాడు.
శ్రీలంకపై టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేసి చిరస్మరణీయ విజయాన్ని అందించిన నేపథ్యంలో హసన్ రజా ఈ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. భారత బౌలర్ల నుంచి భిన్నమైన దూకుడుని చూశామని రజా అన్నాడు. షమీ, సిరాజ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మాజీ దిగ్గజాలు అలన్ డొనాల్డ్, మఖాయ ఎంతినీ బౌలింగ్ లో తాము ఆడిన రోజులు గుర్తుకు వచ్చాయని చెప్పాడు. పాకిస్థాన్‌లోని ఓ ఛానల్ చర్చలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో బంతి మారినట్లు కనిపిస్తోందని రజా అనుమానం వ్యక్తం చేశాడు.
ఐసీసీ, అంపైర్ లేదా బీసీసీఐ భారత బౌలర్లకు వేరే బంతిని అందిస్తున్నాయని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. అందుకే బంతులను తనిఖీ చేయాలని తాను భావిస్తున్నట్టు సూచించాడు. వన్డే మ్యాచ్‌లో మూడు స్లిప్‌లు పెట్టడం, కీపర్ కేఎల్ రాహుల్ కూడా బంతులను అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న తీరు చూస్తే బంతుల్లో అదనపు ‘లక్క పూత’ ఉందనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశాడు. ఆ ఆరోపణలు చేసిన రజాపై మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా కౌంటర్ ఇచ్చాడు. అతని చేష్టలను ‘కామెడీ’గా అభివర్ణించాడు.