KCR: కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేయనున్న కేసీఆర్... కొనసాగుతున్న సెంటిమెంట్!
- ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేయనున్న కేసీఆర్
- ఈ నెల 9న నామినేషన్లు వేయనున్న ముఖ్యమంత్రి
- నామినేషన్లకు ముందు కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేయడం కేసీఆర్ సెంటిమెంట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెంటిమెంట్లు ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన తన సెంటిమెంట్లకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన తన ఫామ్ హౌస్ లో మరోసారి రాజశ్యామల యాగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ యాగం నిన్న పూర్ణాహుతితో ముగిసింది.
ఇదే విధంగా ప్రతి ఎన్నికలో సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడం ఒక సెంటిమెంటుగా వస్తోంది. ఇప్పుడు కూడా కేసీఆర్ అదే సెంటిమెంటును కొనసాగించబోతున్నారు. ఈరోజు ఆయన కోనాయిపల్లికి వెళ్లనున్నారు. వెంకన్న ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తారు. ఈ నెల 9వ తేదీన కామారెడ్డి, గజ్వేల్ లలో కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు.
మరోవైపు 1985లో టీడీపీ అభ్యర్థిగా కేసీఆర్ తొలిసారి పోటీ చేశారు. అప్పుడు కూడా కోనాయిపల్లి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. అప్పటి నుంచి అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు.