Multivitamins: మల్టీవిటమిన్ మాత్రలతో క్యాన్సర్.. 30 శాతం పెరుగుతున్న రిస్క్.. తాజా పరిశోధనలో వెల్లడి
- అవసరానికి, అవసరమైనన్ని రోజులు వాడితే పర్వాలేదట
- దీర్ఘకాలం వాడితే ముప్పు తప్పదంటున్న నిపుణులు
- ఆహార పదార్థాలలో సహజంగా లభించే విటమిన్లే మేలని వివరణ
మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా శరీరానికి అవసరమైన విటమిన్లు అందడంలేదు.. దీంతో విటమిన్ లోపంతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ ఇబ్బందిని తప్పించుకోవడానికి మల్టీవిటమిన్ మాత్రలను వాడడం సాధారణంగా మారింది. అయితే, మల్టీవిటమిన్ల వాడకం శ్రుతిమించితే ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుదీర్ఘకాలం విటమిన్ మాత్రలు వేసుకోవడమంటే క్యాన్సర్ ను ఆహ్వానించినట్లేనని చెబుతున్నారు. యూకేకు చెందిన ఆరోగ్య నిపుణులు జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం బయటపడింది. సింథటిక్ విటమిన్ వాడకం వల్ల లంగ్, ప్రోస్టేట్, బోవెల్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని తేలింది.
విటమిన్ లోపంతో బాధపడుతున్న వారికి అవసరమైన మోతాదులో, అవసరమైన మేరకు మాత్రమే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వాలని యూకే పరిశోధకులు చెబుతున్నారు. మరీ ఎక్కువకాలం ఈ మాత్రలు వేసుకోవడం వల్ల శరీరంలోని క్యాన్సర్ కారక కణాలు ఉత్తేజితమవుతాయని, దీంతో క్యాన్సర్ బారిన పడతారని చెప్పారు. ఈ మాత్రలతో క్యాన్సర్ ముప్పు 30 శాతం పెరుగుతుందని వివరించారు. రోజూ తీసుకునే ఆహారంలోని నేచురల్ విటమిన్లు శరీరంలోకి నెమ్మదిగా చేరతాయి కాబట్టి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. విటమిన్ లోపాలను సాధారణ, సహజ పద్ధతులలో అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు లభిస్తాయని చెప్పారు.