New Zealand: రవీంద్ర సెంచరీ, విలియమ్సన్ బాదుడు... పాక్ ముందు దిమ్మదిరిగే టార్గెట్

New Zealand set Pakistan 402 runs target

  • వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ × పాకిస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
  • 50 ఓవర్లలో 6 వికెట్లకు 401 పరుగులు చేసిన కివీస్
  • రచిన్ రవీంద్ర 108, విలియమ్సన్ 95 పరుగులు
  • ధాటిగా ఆడిన చాప్ మన్, గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్

పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాళ్లు కసిదీరా బ్యాటింగ్ చేశారు. చిచ్చరపిడుగు రచిన్ రవీంద్ర ఈ వరల్డ్ కప్ లో మూడో సెంచరీ నమోదు చేయగా, గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూకుడుగా ఆడి కివీస్ భారీ స్కోరుకు బాటలు పరిచాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 401 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన రచిన్ రవీంద్ర తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ 94 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సుతో 108 పరుగులు చేశాడు. విలియమ్సన్ 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 95 పరుగులు సాధించాడు. విలియమ్సన్ 5 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 

ఆ తర్వాత డారిల్ మిచెల్ 29, మార్క్ చాప్ మన్ 39 పరుగులు చేశారు. చివర్లో గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ మరింత ధాటిగా ఆడడంతో కివీస్ స్కోరు 400 మార్కు దాటింది. చాప్ మన్ 25 బంతుల్లో 4 ఫోర్లు,  2 సిక్సులతో 41 పరుగులు చేయగా, శాంట్నర్ 17 బంతుల్లో 2 సిక్సులతో 26 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు తీయగా, హసన్ అలీ 1, ఇఫ్తికార్ అహ్మద్ 1, హరీస్ రవూఫ్ 1 వికెట్ దక్కించుకున్నారు. 

కాగా, న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆడుతున్న తొలి వరల్డ్ కప్ లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రవీంద్ర రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ వరల్డ్ కప్ లో ఎడమచేతివాటం రవీంద్ర ఇప్పటివరకు 3 శతకాలు నమోదు చేయడం విశేషం.

  • Loading...

More Telugu News