Vijayashanti: పార్టీ మారుతున్న విజయశాంతి?
- ఇంతవరకు విజయశాంతికి టికెట్ ను ఇవ్వని బీజేపీ
- విజయశాంతిని కాంగ్రెస్ లోకి రేవంత్ ఆహ్వానించినట్టు ప్రచారం
- మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో పలువురు కీలక నేతలు బీజేపీని వీడారు. తాజాగా బీజేపీకి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కూడా బీజేపీని వీడుతున్నారనేదే ఆ వార్త. ఇంతవరకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో విజయశాంతి పేరు లేని సంగతి తెలిసిందే. దీంతో, ఆమె తీవ్ర అసహనంతో ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీని వ్యతిరేకించేలా ఉంటున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనడం లేదు. ఈ క్రమంలో బీజేపీకి ఆమె గుడ్ బై చెపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు విజయశాంతితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారని చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని విజయశాంతిని రేవంత్ రెడ్డి ఆహ్వానించారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయాలని రేవంత్ కోరారని... పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ టికెట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ లో విజయశాంతి చేరుతున్నారని సమాచారం. ఇదే జరిగితే బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్టే.