Chandrababu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కీలక అంశాలపై చర్చ... మరోసారి సమావేశం కావాలని నిర్ణయం
- హైదరాబాదులో చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్, నాదెండ్ల
- చంద్రబాబును పరామర్శించిన జనసేనాని
- ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చ
- ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు హైదరాబాదులో చంద్రబాబు నివాసానికి వచ్చారు. చంద్రబాబును పరామర్శించిన అనంతరం, పలు అంశాలపై కీలక చర్చ జరిపారు. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడమే అజెండాగా చంద్రబాబు, పవన్ మధ్య సమావేశం జరిగింది. మేనిఫెస్టోకు సంబంధించిన జనసేన తరఫున 6 అంశాలను పవన్ ప్రతిపాదించారు.
పొత్తు నేపథ్యంలో కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) రూపకల్పన విషయం కూడా వీరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నందున క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ ఎన్నికలపై చంద్రబాబు, పవన్ చర్చించారు. టీడీపీ-జనసేన విస్తృతస్థాయి సమావేశాల నిర్వహణపైనా ఇరువురు మాట్లాడుకున్నారు.
ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. పరిస్థితుల దృష్ట్యా త్వరలోనే మరోసారి సమావేశం కావాలని చంద్రబాబు పవన్ నిర్ణయించారు.