dr k laxman: ఈ నెల 7వ తేదీన బీసీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి: లక్ష్మణ్
- ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపిన లక్ష్మణ్
- తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా ప్రకటించారని వెల్లడి
- బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బీసీని సీఎం చేస్తామని ప్రకటించే దమ్ము ఉందా? అని సవాల్
ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీసీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఇది ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపే సభ అన్నారు.
బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అమిత్ షా ప్రకటించడాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. అందుకే బీసీలు ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదని రాహుల్ గాంధీ అవహేళన చేశారని మండిపడ్డారు. ఈ సభను విజయవంతం చేసి బీసీల పట్ల చిన్నచూపు కలిగిన కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి గుణపాఠం చెప్పాలన్నారు. పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రావాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే దమ్ము ఉందా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఐదు లక్షల మందికి పైగా బీసీలు ఉద్యోగ, ఉపాధి లేకుండా ఉన్నారని వాపోయారు.