Canada: నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తు దెబ్బతింది..భారత రాయబారి ఘాటు వ్యాఖ్య
- నిజ్జర్ హత్యపై దర్యాప్తు సందేహాస్పదంగా మారిందన్న భారత రాయబారి సంజయ్ కుమార్
- హత్య వెనక భారత్ ఏజెంట్లు ఉన్నట్టు చెప్పాలని ఉన్నతస్థాయి వ్యక్తి నుంచి మార్గదర్శకాలు వెళ్లాయని వ్యాఖ్య
- భారత్ పాత్రను నిరూపించే గట్టి ఆధారాలు కెనడా ఇప్పటివరకూ ఇవ్వలేదని వెల్లడి
కెనడాలో ఓ ఉన్నతస్థాయి వ్యక్తి బహిరంగ వ్యాఖ్యల కారణంగా ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు దెబ్బతిందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు కెనడా ప్రధానిపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో సంజయ్ శర్మ చేసిన వ్యాఖ్యలు స్థానిక పత్రికలో తాజాగా ప్రచురితమయ్యాయి.
ఈ ఏడాది జూన్లో వాంకూవర్లో కెనడా పౌరుడైన నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని ఆరోపించడం పెద్ద దౌత్య వివాదానికి దారితీసింది. అయితే, భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనపై భారత రాయబారి తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ కేసుపై దర్యాప్తు సందేహాస్పదమైంది. ఘటన వెనక భారత్ లేదా భారతీయులు ఉన్నారని ప్రకటించాలంటూ ఉన్నత స్థాయి వ్యక్తి నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి’’ అని వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ హత్య వెనక భారత ఏజెంట్లు ఉన్నారని చెప్పేందుకు కెనడా గానీ దాని మిత్ర దేశాలు కానీ ఇప్పటివరకూ గట్టి ఆధారాలేవీ చూపించలేదని వర్మ పేర్కొన్నారు. అయితే, ఇరుదేశాల దౌత్య బంధం ఒత్తిడిలో ఉన్నప్పటికీ కెనడాతో వ్యాపార సంబంధాలు విస్తృతపరిచేందుకు భారత్ సంసిద్ధంగా ఉందన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు రెడీగా ఉందని వెల్లడించారు.