Anam Venkataramana Reddy: వైఎస్ భారతికి ప్రతి నెలా జీతం రూపంలో రూ.32.50 లక్షలు వస్తుంది: ఆనం వెంకటరమణారెడ్డి

Anam Venkataramana Reddy press meet details

  • టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం
  • తాను పేదవాడ్ని అంటూ జగన్ ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శలు
  • జగన్ దంపతులకు భారతి సిమెంట్స్ లో రూ.4 వేల కోట్ల షేర్లు ఉన్నాయని వెల్లడి
  • దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని స్పష్టీకరణ

టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి సీఎం జగన్, భారతి సిమెంట్స్, వైఎస్ భారతిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పేదవాడినని ప్రజలను జగన్ మభ్యపెడుతున్నారని విమర్శించారు. 

వైఎస్ భారతికి ప్రతి నెలా జీతం రూపంలో రూ.32.50 లక్షలు వస్తుందని వెల్లడించారు. వైఎస్ భారతికి ఈ మొత్తం ప్రతి నెలా 1వ తేదీన చెక్కు రూపంలో వస్తుందని తెలిపారు. పేదలు ఎవరో, పెత్తందారులు ఎవరో జగనే చెప్పాలని నిలదీశారు. 

1999లో ఫ్రెంచ్ కంపెనీ భారతి సిమెంట్స్ లో షేర్లు కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఫ్రెంచ్ కంపెనీ రూ.671 చొప్పున షేర్లు కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. భారతి సిమెంట్స్ లో వాటా కొనుగోలు చేసిన ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా ఉందని వివరించారు. కానీ, 49 శాతం వాటా ఉన్న వైఎస్ భారతికి ఎక్కువ జీతం ఉందని తెలిపారు. ఫ్రెంచ్ కంపెనీ డైరెక్టర్ కు మాత్రం తక్కువ జీతం ఉందని అన్నారు. 

14 ఏళ్ల తర్వాత భారతి సిమెంట్స్ షేరు విలువ రూ.1000కి చేరిందని ఆనం వెల్లడించారు. జగన్ కు కూడా భారతి సిమెంట్స్ లో 2.38 కోట్ల షేర్లు ఉన్నాయని, వాటి విలువ ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.2,380 కోట్లు అని స్పష్టం చేశారు. కానీ తనకు ఏమీ లేదని జగన్ ఎన్నికల అఫిడవిట్ లో చెప్పారని ఆరోపించారు. మొత్తమ్మీద జగన్ దంపతులకు భారతి సిమెంట్స్ లో రూ.4 వేల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. వైఎస్ భారతికి సిలికాన్ బిల్డర్స్ లో 1.5 కోట్ల షేర్లు ఉన్నాయని ఆనం తెలిపారు.

వైఎస్సార్ హౌసింగ్ లో ఇళ్లు భారతి సిమెంట్ తో కట్టలేదా? అని ప్రశ్నించారు. భారతి సిమెంటే వాడాలని హుకుం జారీ చేశారని ఆరోపించారు. దేశంలో అప్పులేని ఒకే ఒక సంస్థ భారతి సిమెంట్స్ అని ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. 2001 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు భారతి సిమెంట్స్ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు ఎలా చేరిందని ప్రశ్నించారు. భారతి సిమెంట్స్ ఒక త్రైమాసికంలో రూ.235 కోట్ల ఆదాయం చూపిందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News