Virat Kohli: కోహ్లీ ఫామ్ కొనసాగుతోంది... భారీ స్కోరు దిశగా టీమిండియా
- వరల్డ్ కప్ లో టీమిండియా × దక్షిణాఫ్రికా
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా రోహిత్ శర్మ, గిల్
- వరల్డ్ కప్ లో మరో అర్ధసెంచరీ సాధించిన కోహ్లీ
దక్షిణాఫ్రికాతో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి అర్ధసెంచరీతో మెరిశాడు.
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్ తో సఫారీ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. రోహిత్ శర్మ... వేసిన బంతిని వేసినట్టే కొడుతుండడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. మరో ఎండ్ లో శుభ్ మాన్ గిల్ కూడా ధాటిగా ఆడడంతో రన్ రేట్ ఓవర్ కు 10 చొప్పున కొనసాగింది.
రోహిత్ శర్మ 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. గిల్ 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 23 పరుగులు చేశాడు. రోహిత్ శర్మను రబాడా అవుట్ చేయగా, గిల్ వికెట్ కేశవ్ మహరాజ్ ఖాతాలో చేరింది.
ఆ తర్వాత కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జోడీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 29 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు. కోహ్లీ 53, శ్రేయాస్ అయ్యర్ 39 పరుగులతో ఆడుతున్నారు.