CM KCR: ప్రత్యర్థులను విమర్శించడానికి బూతులు మాట్లాడాలా?: సీఎం కేసీఆర్
- కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ
- హాజరైన సీఎం కేసీఆర్
- అభ్యర్థి మంచివాడో, కాదో చూసి ఓటేయాలని సూచన
- వనమా వెంకటేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇవాళ ఆయన కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికలు వస్తే చాలు... రాష్ట్రంలో వాతావరణం గందరగోళంగా మారుతోందని అన్నారు. ప్రత్యర్థుల్ని విమర్శించడానికి బూతులు మాట్లాడుతున్నారు... నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇవన్నీ అవసరమా అని పేర్కొన్నారు.
"ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి మంచి వాడో, కాదో చూసి ఓటేయాలి. అభ్యర్థి వెనుక పార్టీ ఉంటుంది... ఆ పార్టీ మంచిదో, కాదో చూడండి. ఆ పార్టీ చరిత్రను పరిశీలించండి... ఆ పార్టీ తీరును గమనించండి" అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావును బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
"గత 75 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ చేసింది ఏమిటి? ఏమీ లేదు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది" అని స్పష్టం చేశారు.