Team India: కోల్ కతాలో టీమిండియా బౌలర్ల బీభత్సం... దక్షిణాఫ్రికా 40-5
- వరల్డ్ కప్ లో టీమిండియా బౌలర్ల హవా
- ఇవాళ టీమిండియా × దక్షిణాఫ్రికా
- 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసిన టీమిండియా
- సఫారీ టాపార్డర్ ను కుప్పకూల్చిన షమీ, సిరాజ్, జడేజా
ఈ వరల్డ్ కప్ లో టీమిండియా బౌలర్ల ప్రదర్శన మరో స్థాయిలో ఉంది. నమ్మశక్యం కాని రీతిలో, బుల్లెట్ బంతులతో, ప్రత్యర్థి ఎవరైనా కుప్పకూల్చడమే పనిగా పెట్టుకున్నారు. ఇవాళ బలమైన దక్షిణాఫ్రికా జట్టుపైనా టీమిండియా బౌలర్లు పంజా విసిరారు. సీన్ కట్ చేస్తే... 13.1 ఓవర్లు గడిచేసరికి దక్షిణాఫ్రికా టాపార్డర్ అంతా పెవిలియన్ చేరింది. 327 పరుగుల లక్ష్యఛేదనలో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ప్రమాదకర పేసర్ మహ్మద్ షమీ మరోసారి తన జూలు విదిల్చి 2 వికెట్లు తీయగా, జడేజా సైతం రెండు వికెట్లతో సత్తా చాటాడు. సిరాజ్ ఓ వికెట్ తీశాడు. సఫారీ వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టింది సిరాజే. ఓ అద్భుతమైన స్వింగర్ తో క్వింటన్ డికాక్ (5)ను పెవిలియన్ కు తిప్పి పంపాడు.
సాధారణంగా అటాకింగ్ గేమ్ ఆడే సఫారీలు తమ స్వభావానికి భిన్నంగా ఆత్మరక్షణ ధోరణిలో బ్యాటింగ్ చేయడం ఈ మ్యాచ్ లో కనిపించింది. వికెట్ కాపాడుకుంటే చాలన్న ఆలోచనతో బ్యాటింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 10, మార్కో యన్సెన్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. సఫారీలు గెలవాలంటే ఇంకా 274 పరుగులు చేయాలి. టీమిండియా బౌలర్లు భీకర ఫామ్ లో ఉన్న దృష్ట్యా అది అత్యంత కష్ట సాధ్యం అని చెప్పాలి.