Israel: గాజాను రెండుగా వేరు చేసుకొని కీలక దాడులు: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
- ఉత్తర గాజా, దక్షిణ గాజాగా వేరు చేసుకొని దాడులు చేస్తున్నామని వెల్లడి
- అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ మధ్యప్రాచ్య దేశాల్లో పర్యటన అనంతరం ప్రకటన
- బందీలను అప్పగించే వరకు దాడులు ఆపబోమని హెచ్చరించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు
గాజాలో ముమ్మర ‘గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్ల’తో రక్తపాతం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. గాజాను రెండుగా వేరు చేసుకొని కీలకమైన దాడులు చేస్తున్నట్టు ప్రకటించింది. తమ దళాలు గాజా నగరాన్ని చుట్టుముట్టాయని, ఉత్తర గాజా - దక్షిణ గాజాగా వేరు చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డేనియల్ హగారి ఆదివారం ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం మధ్యప్రాచ్య దేశాలైన వెస్ట్‌బ్యాంక్, ఇరాక్, సైప్రస్‌లలో సుడిగాలి పర్యటన చేసిన అనంతరం ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. పాలస్తీనియన్లకు మానవతా సాయంపై దృష్టి సారించామని బ్లింకెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలావుండగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ను బ్లింకెన్ కలిశారు. అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 9,770 మంది చనిపోయి ఉంటారని హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్యమంత్రిత్వశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా పౌరులే ఉన్నారని వివరించింది. నాలుగు వారాల నుంచి కొనసాగుతున్న యుద్ధంపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు బందీలను తిరిగి అప్పగించే వరకు కాల్పుల విరమణ ఉండబోదని చెప్పడం మరింత కలవరానికి గురిచేస్తోంది.