Bangladesh: కాలుష్య కోరల్లో ఢిల్లీ.. నేటి బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ డౌటే!
- దేశ రాజధానిలో ప్రమాదకర స్థాయిని మించి కాలుష్యం
- ప్రాక్టీస్ రద్దు చేసుకున్న శ్రీలంక
- మాస్కులు ధరించి ప్రాక్టీస్ చేసిన బంగ్లా ఆటగాళ్లు
- మ్యాచ్ నిర్వహణపై నేడు ఐసీసీ ప్రకటన
కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్న ఢిల్లీలో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీలో జరగాల్సిన బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కాలుష్యం భయంతో ఈ రెండు జట్లు ఇప్పటికే తమ ప్రాక్టీస్‌ను రద్దు చేసుకున్నాయి. లంకేయులు శనివారం పూర్తిగా ఇండోర్స్‌కే పరిమితమయ్యారు. బంగ్లా ఆటగాళ్లు మాత్రం సాయంత్రం మాస్కులు ధరించి ప్రాక్టీస్ చేశారు.
రాజధానిలో రోజురోజుకు కాలుష్యం మరింతగా పెరుగుతుండడంతో ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ను రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ నిర్వహణపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రఖ్యాత పల్మనాలజిస్ట్ డాక్టర్ రణ్‌దీప్ గులారియా సేవలను బీసీసీఐ ఉపయోగించుకుంటోంది.
నిజానికి ఐసీసీ నిబంధనల ప్రకారం మైదానం, వాతావరణం లేదంటే మరే ఇతర పరిస్థితులైనా ప్రమాదకరంగా ఉన్నాయని అంపైర్లు కనుక భావిస్తే ఆటను ఆపేయొచ్చు. లేదంటే ప్రారంభాన్ని రద్దు చేయొచ్చు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌పై మరికొన్ని గంటల్లో ఐసీసీ, బీసీసీఐ సంయుక్తంగా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.