Rohit Sharma: దక్షిణాఫ్రికాను కుప్పకూల్చడం అంత తేలికైన విషయం కాదు.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు
- బౌలర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో సఫారీలను కట్టడి చేశారన్న రోహిత్
- కోహ్లీ నుంచి మరిన్ని కీలక ఇన్నింగ్స్ రావాలని ఆశాభావం
- షమీ కమ్ బ్యాాక్‌ను ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారన్న టీమిండియా సారథి
- రాబోయే మ్యాచ్‌ల కోసం జట్టులో మార్పులు ఉండవని స్పష్టీకరణ
ప్రపంచకప్ మ్యాచ్‌లో భాగంగా గత రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ విజయం సాధించిన టీమిండియా టేబుల్ టాపర్‌గా ఉంది. నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం సారథి రోహిత్‌శర్మ మాట్లాడుతూ.. సెంచరీ వీరుడు కోహ్లీ సహా అందరిపైనా ప్రశంసలు కురిపించాడు. హార్డ్ హిట్టర్లు కలిగిన సఫారీ జట్టును కుప్పకూల్చడం అంత తేలికైన విషయం కాదని, కానీ లైన్ అండ్ లెంగ్త్‌తో తమ బౌలర్లు దానిని సాధించారని కొనియాడాడు.
కుర్రాళ్లందరూ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుండడం సంతోషంగా ఉందన్నాడు. దక్షిణాఫ్రికాపై విజయంలో బౌలర్లదే కీలక పాత్ర అని, కోహ్లీ సెంచరీతో భారీ స్కోరు సాధించగలిగామని చెప్పుకొచ్చాడు. గత మూడు మ్యాచ్‌ల నుంచి తాము మరింత మెరుగయ్యామని చెప్పాడు. కోహ్లీ నుంచి మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు రావాలన్న రోహిత్.. పేసర్ షమీ కమ్‌బ్యాక్‌ను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాపై జడేజా క్లాసిక్ బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. ఇకపై జరగబోయే మ్యాచ్‌లు చాలా కీలకమని, కాబట్టి జట్టులో ఎలాంటి మార్పులు చేయాలనుకోవడం లేదని రోహిత్ వివరించాడు.