Raja Singh: బండి సంజయ్‌ ఓ శక్తి.. ఆయనతో దున్నపోతులు పోటీపడలేవ్!: రాజాసింగ్

Raja Singh hot comments on minister gangula kamalakar

  • సంజయ్ గెలుపును ఎవరూ ఆపలేరన్న రాజాసింగ్ 
  • కేసీఆర్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర చేసి పార్టీని బలోపేతం చేశారన్న ఎమ్మెల్యే
  • గంగుల కమలాకర్‌ మజ్లిస్ పార్టీ కార్యాలయానికి పరుగెత్తారని ఎద్దేవా 

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓ శక్తి అని, ఆయనతో దున్నపోతులు పోటీ పడలేవని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ... కరీంనగర్‌లో సంజయ్ నామినేషన్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. ఆయనను ఇక్కడి నుంచే పార్లమెంటుకు పంపించిన ప్రజలు... ఇప్పుడు అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకొని ప్రజా సంగ్రామ యాత్ర చేసి పార్టీని బలోపేతం చేశారన్నారు.

డబ్బు వైపు ఉందామా? ధర్మం వైపు ఉందామా? అని కరీంనగర్ ప్రజలు తెలుసుకొని ఓటు వేయాలన్నారు. ధర్మం కోసం, ప్రజల వైపు నిలుస్తూ నిరంతరం పోరాడే బీజేపీ వైపు ఉంటారా? అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించి ఓటుకు రూ.20 వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ కావాలా? ప్రజలు తేల్చుకోవాలన్నారు. బండి సంజయ్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని అన్నారు. అలాంటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవన్నారు. మైనార్టీలు కూడా ఆలోచన చేయాలని, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి మైనార్టీ అక్కాచెల్లెళ్ల పరువును కాపాడామన్నారు.

గంగుల కమలాకర్‌పై విమర్శలు

బండి సంజయ్ పోరాటాన్ని మంత్రి గంగుల కమలాకర్ చూశాడని, ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడని తెలియగానే మంత్రి... దారుస్సలాంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయానికి పరుగెత్తారని ఎద్దేవా చేశారు. గంగుల కమలాకర్ ఓటమి ఖాయమైందన్నారు. ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంటే ఆయనకే మంచిదన్నారు. సంజయ్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. గంగుల అవినీతికి అంతులేకుండా పోయిందన్నారు. గుడి, బడి, గ్రానైట్ సహా అన్నింటా అవినీతికి పాల్పడుతున్నారన్నారు.

  • Loading...

More Telugu News