Revanth Reddy: డీకే శివకుమార్ కంటే ఎక్కువ మెజార్టీ రావాలి: రేవంత్ రెడ్డి
- కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి
- ఇక్కడ బీఆర్ఎస్ గెలిచినా అభివృద్ధి చేయలేదని విమర్శ
- రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని వ్యాఖ్య
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు లక్ష 20 వేల మెజార్టీ వచ్చిందని... కొడంగల్ లో మనకు అంతకన్నా ఎక్కువ మెజార్టీ రావాలని అన్నారు. భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. గత ఎన్నికల్లో కొడంగల్ లో బీఆర్ఎస్ ను గెలిపించినా... నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ పార్టీ... ఇక్కడ మళ్లీ ఓట్లను ఎలా అడుగుతుందని ప్రశ్నించారు.
తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చింది తన కోసం కాదని... మీ కోసమేనని అన్నారు. కొడంగల్ యువతకు ఉద్యోగాలను అందించేందుకు జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలు అని చెప్పారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని... ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని అన్నారు. ఈరోజు నామినేషన్ వేశానని... తెలంగాణ గెలవబోతోందని... అది కొడంగల్ నుంచే ఆరంభమవుతుందని చెప్పారు.