YS Sharmila: రేవంత్ రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేసిన షర్మిల... ద్రోహులన్న కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం
- రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నారని తొలుత తాను అనలేదన్న షర్మిల
- అన్ని పార్టీలలోనూ దొంగలు ఉన్నారనీ, ఆ దొంగలు సీఎం కాకూడదని వ్యాఖ్య
- ఇచ్చిన హామీలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాలపై ప్రశ్నించిన తాము ద్రోహులమా? అని కేటీఆర్‌కు నిలదీత
- తెలంగాణ అప్పులపాలవుతుంటే, కేసీఆర్ కోట్లు సంపాదించుకుంటున్నారని ఆరోపణ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రవ్యాఖ్యలు చేశారు. తనపై కేసు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ ఆయనకు ఊరట కలగలేదని, వీరు దోషులే కాబట్టి కేసు విచారణ జరగాలని చెప్పిందని ఆమె అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... అన్ని పార్టీల్లోనూ దొంగలు ఉన్నారని, అలాంటి దొంగలను ముఖ్యమంత్రి కానీయకూడదని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డికి రేటెంత రెడ్డి అని పేరు పెట్టింది తాను కాదన్నారు. అలాగే రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకున్నారని మొదట ఆరోపించింది తాను కాదన్నారు. తనకు ఎవరో కిరీటం పెడతారని తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం లేదని, తెలంగాణ ప్రజల కోసం ఇస్తున్నానని అన్నారు.
తన నిర్ణయాలు తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడాన్ని తన పార్టీలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు ఉన్నదే ప్రజల కోసం అన్నారు. అందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి సొంత పార్టీవారిపై కూడా పోరాటం చేశారన్నారు. మనకు పార్టీలు, పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజలు ముఖ్యమన్నారు.
3,800 కిలో మీటర్ల పాదయాత్ర చేశానని, రోడ్లపై బతికానని అలాంటి తాను పోటీ చేయకూడదని త్యాగం చేస్తున్నానంటే తనకు ఎంత బాధ ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన వారిని తెలంగాణ ద్రోహులు అని కేటీఆర్ అన్నారని, కానీ తెలంగాణ ద్రోహులు ఎవరు? అని ఆమె ప్రశ్నించారు. మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని... రుణమాఫీ చేయలేదని... డబుల్ బెడ్రూం ఇళ్లు... పోడు భూములు ఇవ్వాలని... ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని... తాము ప్రశ్నించామని, అలాంటి తాము తెలంగాణ ద్రోహులమా? అన్నారు.
కేసీఆర్‌పై విమర్శలు
ఓ వైపు ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నా... మునిగిపోతున్నా... కూలిపోతున్నా స్వార్థరాజకీయాల కోసం ఎవరికీ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై కేంద్రం ఏ చర్యలు తీసుకోవడం లేదని, సీబీఐ విచారణ లేదని, అరెస్టులు లేవని మండిపడ్డారు. తెలంగాణలో ఎంతమందిపై సీబీఐ, ఈడీ దాడులు జరగడం లేదని, కానీ బీఆర్ఎస్పై ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఈడీ మోదీ చేతిలో ఉంటే, ఐటీ అమిత్ షా చేతిలో ఉందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్ కుంగిపోయిందని, పంప్ హౌస్‌లు మునిగిపోతుంటే కేంద్రానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ అవినీతిపై, మెఘా కృష్ణారెడ్డిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేపు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారు కాబట్టి తాము విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తున్నానని, ఇలాంటి దొంగలకు ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే కనుక మళ్లీ కాళేశ్వరం పేరు... మరో ప్రాజెక్టు పేరు చెప్పి దోచుకుంటారన్నారు. ఓ వైపు తెలంగాణకు అప్పులు పెరిగిపోతుంటే కేసీఆర్ మాత్రం కోట్లు సంపాదించుకుంటున్నారన్నారు. ఇలాంటి దొంగలకు ఓట్లు వేయవద్దన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని, కాబట్టి ఇలాంటి దొంగలకు ఓట్లు వేయవద్దని తాను కోరుకుంటున్నానన్నారు.