Venkatesh Prasad: అవును... కోహ్లీ స్వార్థపరుడే!: విమర్శకులకు దీటుగా బదులిచ్చిన వెంకటేశ్ ప్రసాద్
- వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాపై కోహ్లీ సెంచరీ
- 49 సెంచరీల సచిన్ రికార్డు సమం
- సెంచరీల కోసమే ఆడతాడని కోహ్లీపై విమర్శలు
టీమిండియా డైనమిక్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై సెంచరీతో వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు (49)ను సమం చేయడం తెలిసిందే. అయితే, కోహ్లీ రికార్డుల కోసమే ఆడతాడని, సెంచరీల కోసం స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంటాడని విమర్శలు వినిపించాయి.
దీనిపై భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ గట్టిగా స్పందించారు. 'అవును.. కోహ్లీ స్వార్థపరుడే' అంటూ తనదైన శైలిలో విమర్శకులకు దీటుగా సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. కోహ్లీ స్వార్థపరుడని, వ్యక్తిగత మైలురాళ్ల కోసం పాకులాడుతుంటాడని కొన్ని తమాషా వాదనలు వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుందని పేర్కొన్నారు.
"అవును... కోహ్లీ స్వార్థపరుడే! కోట్లాది మంది అభిమానుల కలను సాకారం చేస్తున్నందుకు కోహ్లీ స్వార్థపరుడే! ఎంతో సాధించినప్పటికీ ఇంకా సాధించాలని ఆరాటపడుతున్నందుకు కోహ్లీ స్వార్థపరుడే! బ్యాటింగ్ లో సరికొత్త ప్రమాణాలు నిర్దేశించినందుకు కోహ్లీ స్వార్థపరుడే! జట్టు విజయాల కోసం తన వంతు సహకారం అందిస్తున్నందుకు కోహ్లీ స్వార్థపరుడే!" అంటూ వెంకీ ట్వీట్ చేశారు.