KCR: భవిష్యత్తులో ఇదే పద్ధతిలో తెలంగాణ ముందుకెళ్లాలంటే బీఆర్ఎస్సే శ్రీరామరక్ష: కేసీఆర్
- గతంలో చాలామంది ముఖ్యమంత్రులు పాలమూరును దత్తత తీసుకొని చేసిందేమీ లేదన్న కేసీఆర్
- తెలంగాణలో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామన్న కేసీఆర్
- తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ ఆలస్యం చేసిందని విమర్శలు
గతంలోని ముఖ్యమంత్రులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని చేసిందేమీ లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నారాయణపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ రాజ్యంలో కాలని మోటార్... ఎండని పొలం లేదన్నారు. ఇప్పుడు మళ్లీ అదే రాజ్యం మనకు కావాలా? అని ప్రశ్నించారు. పార్టీల వైఖరిని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రులు అప్పుడు ఈ జిల్లాను ఎందుకు పట్టించుకోలేదు? అన్నారు. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు ఈ జిల్లా దత్తత తీసుకున్నారు... కానీ ఏం చేయలేదన్నారు. కనీసం మంచినీళ్లు ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు మిషన్ భగరీథ పుణ్యమాని ప్రతి ఇంట్లో ప్రతి రోజూ నీళ్లు వస్తున్నాయన్నారు. గతంల ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని వరుస కట్టేవాళ్లమన్నారు. తెలంగాణలో మనం ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు.
భవిష్యత్తులోనూ తెలంగాణ ఇదే పద్ధతిలో ముందుకు వెళ్లాలంటే బీఆర్ఎస్సే మనకు శ్రీరామరక్ష అన్నారు. పాలమూరు నుంచి వలసలు వెళ్లినా అప్పుడు ఎవరూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ జీవితంలో ఎప్పుడైనా జై తెలంగాణ అని అన్నాయా? వాళ్లకు మంత్రి పదవులు ఇస్తే నోర్లు మూసేశారు తప్పా.. కాంట్రాక్టులు పట్టుకొని పైకి వచ్చారు తప్ప.. తెలంగాణ కావాలని కోరుకోలేదన్నారు. తాను పిడికెడు మందితో బయలుదేరి తెలంగాణ అంతా తిరిగి ప్రజలను చైతన్యం చేస్తే.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిస్తే కాంగ్రెస్ రాజకీయ కాంక్షతో 2004లో మనతో పొత్తు పెట్టుకుందన్నారు. కానీ కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందన్నారు. పదేళ్ల దాకా తెలంగాణ ఇవ్వలేదన్నారు. పైగా బీఆర్ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేశారని, ఎమ్మెల్యేలను కొనే కుట్ర చేశారన్నారు.
దీంతో తాను కేసీఆర్ చచ్చుడో... తెలంగాణ వచ్చుడో... ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే... 33 పార్టీల లేఖలు వారి మొఖాన కొడితే... దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పిస్తే తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చిందన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి వెళ్లారన్నారు. ఏడాది పాటు విద్యార్థులు చనిపోయి... భయంకరమైన ఉద్యమాలు జరిగితే అప్పుడు తెలంగాణ వచ్చిందన్నారు. మనకు నాలుగు కిలో మీటర్ల దూరంలో కర్ణాటక ఉందని, అక్కడ ఏం జరుగుతుందో చూడాలన్నారు. కర్ణాటక రైతులు ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ను తిడుతున్నారన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి తాము అక్కడ ఐదు గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ మనం ఇక్కడ 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు.