K Kavitha: రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కల్వకుంట్ల కవిత ఏమన్నారంటే...!
- సోషల్ మీడియాలో రష్మిక డీప్ ఫేక్ వీడియోల కలకలం
- ఇలాంటి వీడియోలు దారుణమన్న కవిత
- పార్లమెంటరీ కమిటీ వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
- కవితకు కృతజ్ఞతలు తెలిపిన రష్మిక
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ముఖంతో డీప్ ఫేక్ వీడియోలు రూపొందించి వాటిని సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తుండడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత స్పందించారు.
రష్మిక మందన్నను లక్ష్యంగా చేసుకుని డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ లో ఎవరిపై అయినా భయానక రీతిలో ఇలాంటి తారుమారు వీడియోలు రూపొందించడం ఎంత సులభమో రష్మిక ఉదంతం వివరిస్తోందని కవిత అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో నెలకొన్న పరిస్థితుల పట్ల అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని పేర్కొన్నారు. సైబర్ బెదిరింపుల నుంచి భారత మహిళలకు భద్రత కల్పించడానికి తక్షణ చర్యలు అవసరమని కవిత స్పష్టం చేశారు.
భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సంబంధిత శాఖల కేంద్ర మంత్రులు అశ్వని వైష్ణవ్, రాజీవ్ గోయల్ దీనిపై వెంటనే స్పందించి ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర చర్యలకు శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, కవిత ట్వీట్ పట్ల రష్మిక స్పందించారు. తనకు మద్దతు ప్రకటించినందుకు "థాంక్యూ మేడమ్" అంటూ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.