Udayanidhi Stalin: సనాతన ధర్మాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉండాలి: ఉదయనిధి స్టాలిన్
- గతంలో సనాతన ధర్మంపై స్టాలిన్ వ్యాఖ్యలు వివాదాస్పదం
- సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న స్టాలిన్
- స్టాలిన్ వ్యాఖ్యలపై చర్యలు ఏవంటూ పోలీసులను ప్రశ్నించిన మద్రాస్ హైకోర్టు
ఇటీవల సనాతన ధర్మాన్ని మహమ్మారి వ్యాధులతో పోల్చి తీవ్ర కలకలం రేపిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి అదే అంశంపై స్పందించారు. సనాతన ధర్మంపై తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. సనాతన ధర్మాన్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉండాలని పిలుపునిచ్చారు.
కాగా, ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ మద్రాస్ హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విభజన ఆలోచనలు ప్రోత్సహించడం, ఏదైనా భావజాలాన్ని తుడిచిపెట్టేయాలనుకోవడం వంటి చర్యలకు పాల్పడే హక్కు ఏ వ్యక్తికీ లేదు అని మద్రాస్ హైకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.
కోర్టు విచారణ అనంతరం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎలాంటి న్యాయపరమైన చర్యలకైనా తాను సిద్ధమేనని ఉద్ఘాటించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని భావిస్తున్నానని, సనాతన ధర్మంపై తన అభిప్రాయాలను మార్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నానని తెలిపారు.