Narendra Modi: మీ శక్తిని ఉపయోగించి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వెంటనే ఆపండి: ఫోన్ ద్వారా మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు
- ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలం అవుతున్న గాజా
- మహిళలు, చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని ఇరాన్ అధ్యక్షుడి ఆవేదన
- ఇజ్రాయెల్ చర్యలను అందరూ ఖండించాలని విన్నపం
ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడికి తెగబడిన హమాస్ టెర్రర్ గ్రూప్ తగిన మూల్యాన్ని చెల్లించుకుంటోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల్లో హమాస్ ఉనికే ప్రమాదంలో పడింది. ఇజ్రెయెల్ దాడులతో గాజా విలవిల్లాడుతోంది. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకోబోతోందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఫోన్ లో మాట్లాడారు. భారత్ తన సర్వశక్తులను ఉపయోగించి ఇజ్రాయెల్ - గాజా సంక్షోభాన్ని వెంటనే ఆపాలని మోదీని ఆయన కోరారు. ఇద్దరు నేతల సంభాషణకు సంబంధించి ఇరాన్ అధికారికంగా వివరాలను వెల్లడించింది. పశ్చిమ దేశాల అఘాయిత్యాలతో ఇండియా పడిన కష్టాలు... ఆ తర్వాత అలీన ఉద్యమానికి భారత్ నాంది పలకడం వంటి వాటిని కూడా రైసీ ప్రస్తావించారు.
తక్షణ సీజ్ ఫైర్ కోసం సంయుక్తంగా చేపట్టే ఏ గ్లోబల్ కార్యక్రమానికైనా ఇరాన్ మద్దతుగా ఉంటుందని రైసీ చెప్పారు. గాజాలో పాలస్తీనీయులను దారుణంగా చంపుతున్నారని, అమాయక మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మసీదులు, చర్చిలు, నివాస స్థలాలపై ఇజ్రాయెల్ బాంబులు కురిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రాంతీయ పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెప్పారు. ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.
తమ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడాన్ని అడ్డుకునే హక్కు పాలస్తీనియన్లకు ఉంటుందని రైసీ చెప్పారు. నాజీ జర్మనీకి వ్యతిరేకంగా గతంలో యూరోపియన్ దేశాలన్నీ ఒక్కటి కావడం చారిత్రాత్మకమని, ఒక హీరోయిక్ యాక్ట్ అని కొనియాడారు. ఇదే సమయంలో గాజాలో జరుగుతున్న నరమేధాన్ని ఎందుకు ఇతర దేశాలు ఖండించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇండియా కీలక పాత్రను పోషించాలని కోరారు.
భారత్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని రైసీ చెప్పారు. పరస్పర సహకారంతో, వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. తమ దేశంలోని చబాహర్ పోర్టుతో పాటు పలు రంగాల్లో భారత్ భారీ పెట్టుబడులు పెట్టాలని కోరారు.