Visakhapatnam: విశాఖ-తిరుపతి రైలు నుంచి పొగలు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు
- ఎస్-3 బోగీలోని టాయిలెట్ల వద్ద పొగలు
- ఓ సంచిలో ఉన్న బాణసంచా అంటుకున్న వైనం
- అప్రమత్తమై కాలితో తొక్కి బయటకు పడేసిన ప్రయాణికుడు
- తప్పిన పెను ప్రమాదం
విశాఖ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాయి. అప్రమత్తమైన కొందరు చైన్ లాగి రైలును నిలిపివేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిన్న మధ్యాహ్నం విశాఖపట్టణం నుంచి తిరుపతికి బయలుదేరిన రైలు నాలుగు గంటల సమయంలో తుని రైల్వే స్టేషన్‌లో ఆగింది. అనంతరం బయలుదేరుతున్న సమయంలో ఎస్ 3 బోగీలోని టాయిలెట్ల దగ్గర పొగలు వచ్చాయి. పొగ చూసిన ప్రయాణికులు భయపడ్డారు. వెంటనే చైన్ లాగి రైలును నిలపివేశారు.
కొందరు ప్రయాణికులు పొగ వస్తున్న చోటుకి వెళ్లి చూస్తే ఓ సంచిలోని బాణసంచా నుంచి పొగలు రావడం కనిపించింది. వెంటనే ఓ వ్యక్తి కాలితో తొక్కి సంచిని బయటకు తోసేశాడు. సకాలంలో పొగను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు పేర్కొన్నారు. సంచిలోని బాణసంచా మొత్తం అంటుకుని ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదన్నారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది బోగీని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రైలు బయల్దేరింది.