Andhra Pradesh: ఏపీలో ఓటర్ జాబితాలో అధికారుల నిర్లక్ష్యం.. పేరు మహిళది, ఫొటో ముఖ్యమంత్రిది..!
- ప్రకాశం జిల్లాలో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం
- చెర్లోపల్లి ఓటర్ జాబితాలో సీఎం ఫొటో
- జగన్ ఫొటో స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోని సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ జాబితా విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం ఈ ఆరోపణలకు ఊతమిచ్చే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓటర్ జాబితాలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో దర్శనమిచ్చింది. అది కూడా ఓ మహిళ ఫొటో ఉండాల్సిన చోట సీఎం జగన్ ఫొటో ఉంది. ఫొటో స్పష్టంగా కనిపిస్తున్నా సరే పోలింగ్ సిబ్బంది పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ జాబితాలో సవరణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెర్లోపల్లి గ్రామ ఓటర్ జాబితాలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో దర్శనమిచ్చింది. గ్రామానికి చెందిన గురవమ్మ అనే మహిళ ఫొటో ఉండాల్సిన చోట సీఎం ఫొటోను అప్ లోడ్ చేశారు. బీఎల్ వో లో కంప్యూటర్ ఆపరేటర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఓటర్ జాబితాను సిద్ధం చేశాక ప్రింటింగ్ కు ఇచ్చే ముందు బీఎల్ వో తో పాటు రెవెన్యూ అధికారులు కూడా చెక్ చేస్తారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నాయి.