Telangana: చిల్లర నాణేలతో నామినేషన్ దాఖలు చేయాలని వస్తే... తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి
- రూ.10 నాణేలతో జహీరాబాద్ నుంచి నామినేషన్ దాఖలకు ప్రయత్నించిన బహుజన ముక్తి పార్టీ అభ్యర్థి
- రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో నోట్ల రూపంలో చెల్లించి నామినేషన్ దాఖలు
- చిల్లర రాజకీయాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో తాను చిల్లర జమ చేశానన్న అభ్యర్థి
బహుజన ముక్తి పార్టీ అభ్యర్థి చంద్రకాంత్ మంగళవారం... జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పూర్తి చిల్లరతో నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ రిటర్నింగ్ అధికారులు ఆ చిల్లర తీసుకోవడానికి నిరాకరించడంతో ఆ తర్వాత నోట్ల రూపంలో రూ.5000 చెల్లించి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మొత్తం రూ.10 నాణేలు తీసుకు వచ్చారు.
నామినేషన్ దాఖలు అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశంలో, రాష్ట్రంలో చిల్లర రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే ఉద్దేశ్యంతోనే తాను చిల్లరను జమ చేసుకొని, నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చానన్నారు. మంచి రాజకీయాలను బలపరచాలన్నారు. ప్రజలకు మేలు చేసే వారిని అసెంబ్లీకి పంపించాలన్నారు. ఈ నాణేలను చాలాకాలంగా తాను కూడబెట్టానని, కానీ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారన్నారు. తాను తెచ్చిన నాణేలు ఆర్బీఐ ముద్రించిన నాణేలే అన్నారు. కానీ వాటిని తీసుకొని ఉంటే బాగుండేదన్నారు.