Mahmoud Abbas: పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ కాన్వాయ్‌పై దాడి.. వీడియో ఇదిగో!
- అబ్బాస్ అంగరక్షకుడి మృతి
- దాడికి బాధ్యత ప్రకటించిన ‘సన్స్ ఆఫ్ జందాల్’ గ్రూప్
- డెడ్‌లైన్ ముగిసిన వెంటనే ఎటాక్ చేసిన రెబల్ గ్రూప్
పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ కాన్వాయ్‌పై వెస్ట్‌బ్యాంక్‌లో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన అంగరక్షకుల్లో ఒకరు మృతి చెందాడు. ‘సన్స్ ఆఫ్ అబు జందాల్’ అనే తిరుగుబాటు సంస్థ ఈ దాడికి బాధ్యత ప్రకటించింది. గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకోవాలంటూ అబ్బాస్‌కు ఈ గ్రూప్ 24 గంటల సమయం ఇస్తూ అల్టిమేటం జారీ చేసింది. అదికాస్తా ముగియడంతో దాడికి పాల్పడింది.
గాజాపై ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని, ఇజ్రాయెల్ ఆక్రమణపై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాలని సన్స్ ఆఫ్ అబు జిందాల్ గ్రూప్ డిమాండ్ చేస్తూ అధ్యక్షుడు అబ్బాస్‌కు 24 గంటల సమయం ఇచ్చింది. ఆక్రమిత వెస్ట్‌బ్యాంకును పాలిస్తున్న పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో)కు అబ్బాస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో వెస్ట్‌బ్యాంక్‌లో అబ్బాస్ సమావేశమైన తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. ఇజ్రాయెల్ దాడులు ఆపేలా చూడాలని ఈ సందర్భంగా బ్లింకెన్‌ను అబ్బాస్ కోరారు.