Khammam Student: వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స అనంతరం.. అమెరికాలో కన్నుమూసిన ఖమ్మం విద్యార్థి!
- గత నెల 26న షికాగోలో కత్తిపోట్లకు గురైన వరుణ్
- చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూత
- కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఖమ్మం విద్యార్థి వరుణ్ రాజ్ మంగళవారం కన్నుమూశాడు. గతనెల 26న షికాగోలో దుండగుడి దాడిలో వరుణ్ గాయపడ్డాడు. కత్తిపోట్లకు గురైన అతడిని ఎమర్జెన్సీ సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారు. వారం రోజులుగా వెంటిలేటర్ పై ఉన్న వరుణ్ తాజాగా చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. కొడుకు మరణవార్త తెలిసి ఖమ్మంలోని వరుణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్ద చదువులు చదివి కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కొడుకు హఠాన్మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు.
ఖమ్మంలోని బుర్హాన్ పురంలో నివసించే పుచ్చా రామ్మూర్తి కుమారుడైన వరుణ్ రాజ్.. ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లాడు. ఇండియానాలోని వాల్పరైసో యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 26న జిమ్ నుంచి తిరిగి ఇంటికి వెళుతుండగా వరుణ్ పై ఓ దుండగుడు దాడి చేశాడు. కత్తితో పొడవడంతో వరుణ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించినా ఉపయోగంలేకుండా పోయింది. కాగా, వరుణ్ పై దాడికి పాల్పడ్డ వ్యక్తిని ఆండ్రేడ్ జోర్డాన్ గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి కారణాలేంటనే వివరాలను తెలుసుకునేందుకు ప్రశ్నిస్తున్నారు.