Mohammed Shami: ‘కాస్తన్నా సిగ్గుండాలి’.. పాక్ మాజీ క్రికెటర్‌పై ఫైరైపోయిన షమీ
- భారత బౌలర్లకు 2 రకాల బాల్స్ అందుతున్నాయన్న పాక్ మాజీ క్రికెటర్ రజా
- రజా ఆరోపణల్ని ఖండించిన వసీం ఆక్రమ్
- రజాపై తాజాగా మండిపడ్డ భారత బౌలర్ మహమ్మద్ షమీ
- ‘మీ క్రీడాకారుడి మాట నమ్మకపోతే ఎలా?’ అంటూ చురక
ఈ వరల్డ్ కప్‌లో వరుస ఓటములతో కుదేలైన పాకిస్థాన్ ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా భారత్‌పై అవాకులు చవాకులు పేలిన విషయం తెలిసిందే. భారత్‌కు రెండు రకాల బంతులు అందుతున్నాయంటూ పాక్ మాజీ క్రికెటర్ రజా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించాడు. అంతేకాకుండా, ఈ విషయమై ఐసీసీ కూడా దర్యాప్తు చేయాలని కోరాడు. ఈ ఆరోపణల్ని స్వయంగా పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ ఖండించారు. మీ పరువు మీరే తీసుకుంటున్నారంటూ దుయ్యబట్టాడు. తాజాగా భారత బౌలర్ మహమ్మద్ షమీ కూడా రంగంలోకి దిగాడు. హసన్ రజాను టార్గెట్ చేస్తూ, అతడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
‘‘ఇలాంటి మాటలు అంటున్నందుకు మీరు సిగ్గుపడాలి. మూర్ఖపు వ్యాఖ్యలు చేసే బదులు ఆటపై దృష్టి పెడితే మంచిది. ఇది ఐసీసీ వరల్డ్ కప్.. మీ దేశంలో జరిగే లోకల్ మ్యాచ్ కాదు. వసీం అంతా వివరించినా కూడా తీరు మారదా? మీ ఆటగాడినే మీరు నమ్మరా?’’ అంటూ షమీ ఇన్‌స్టాలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు.