Indonesia: ఇండోనేషియాలోని బాండా సముద్రంలో తీవ్ర భూకంపం..
- 6.7 తీవ్రతతో సంభవించినట్టు గుర్తించిన యూఎస్ జియోలాజికల్ సర్వే
- సునామీ వచ్చే అవకాశంలేదని వెల్లడించిన ఇండోనేషియా అధికారులు
- భూకంప భయాలతో వణికిపోతున్న ఇండోనేషియా వాసులు
ఇండోనేషియాలోని బాండా సముద్రంలో తీవ్ర భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి 8.02 గంటల సమయంలో 6.7 శక్తిమంతమైన భూకంపాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. అయితే ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని ఇండోనేషియా అధికారులు స్పష్టం చేశారు. కాగా మంగళవారం ఉదయం 11.53 గంటల సమయంలో తనింబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్టణంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. అయితే దీని కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు నమోదుకాలేదని అధికారులు తెలిపారు.
కాగా భూకంప భయాలు ఇండోనేషియాను వెంటాడుతుంటాయి. ఈ దేశం పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం జపాన్ నుంచి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ మీదుగా చాలా వరకు విస్తరించి ఉంటుంది. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు అధికంగా ఉంటాయి. మరోవైపు సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలుతుంటాయి. ఈ కారణంగానే ఈ ప్రాంతంలోని దేశాల్లో భూకంపాలు అధికంగా నమోదవుతుంటాయి. అంతేకాదు తీవ్రత కూడా ఎక్కువగా నమోదవుతుంటుంది.