Mary Millben: నేనే కనుక భారతీయురాలినై ఉంటేనా.. నితీశ్‌కుమార్‌పై అమెరికా సింగర్ తీవ్ర వ్యాఖ్యలు
- జనాభా నియంత్రణపై నితీశ్‌కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తానైతే నితీశ్ రాజీనామాకు డిమాండ్ చేసేదానినన్న మిల్బెన్
- బీహార్ వచ్చి సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచేదానినని పేర్కొన్న సింగర్
- బీహార్‌లో నాయకత్వానికి ఓ మహిళకు సాధికారత కల్పించాలని బీజేపీని కోరిన నటి
జనాభా నియంత్రణపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ అమెరికా గాయకురాలు, ఆఫ్రికన్-అమెరికన్ నటి మేరీ మిల్బెన్ స్పందించారు. తాను కనుక భారత పౌరురాలిని అయి ఉంటే నితీశ్ రాజీనామాకు డిమాండ్ చేసి ఉండేదానినని పేర్కొన్నారు. బీహార్ చేరుకుని ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసి ఉండేదానినని తెలిపారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ హ్యాండిల్‌లో రాసుకొచ్చారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు ఓ కార్యక్రమంలో ఆయన పాదాలను తాకి అందరి దృష్టిని ఆకర్షించారు మిల్బెన్. ధైర్యవంతురాలైన మహిళ బీహార్ సీఎంగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని మిల్బెన్ పేర్కొన్నారు.
‘‘బీహార్ ప్రజలారా, భారత ప్రజలారా.. మహిళకు ఓటువేసే శక్తి మీకుంది. మార్పుకు ఓటువేసే శక్తి మీకు ఉంది’’ అని ఆమె పిలుపునిచ్చారు. బీహార్‌లో నాయకత్వానికి ఓ మహిళకు సాధికారత కల్పించాలని బీజేపీని కోరారు. జవాన్ సినిమాలో షారూఖ్‌ఖాన్ చెప్పినట్టు ఓటువేసి మార్పు తీసుకురావాలని మిల్బెన్ పేర్కొన్నారు.