Atchannaidu: ఈ నెల 17 నుంచి టీడీపీ-జనసేన ఉమ్మడిగా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం చేపడతాయి: అచ్చెన్నాయుడు
- విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం
- సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు
- కరవు అంశం ప్రధాన అజెండాగా ఉమ్మడి కార్యాచరణ
- ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం ఈ నెల 13న ఉంటుందని వెల్లడి
విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17 నుంచి టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళతాయని వెల్లడించారు.
ఎప్పుడూ రానంత కరవు రాష్ట్రంలో వచ్చిందని అన్నారు. ఈ ఏడాది వర్షపాతం లేదని, దుర్భిక్షం తాండవిస్తోందని తెలిపారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రంలో కరవే లేదని ముఖ్యమంత్రి అంటున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. కరవును ప్రధాన అంశంగా తీసుకుని టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతాయని వెల్లడించారు. తాము రైతుల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
175 నియోజకవర్గాల్లో 3 రోజుల చొప్పున టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు ఉంటాయని వివరించారు. నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయించామని తెలిపారు. ఆత్మీయ సమావేశాలు ఏ నియోజకవర్గంలో ఎప్పుడు అనేది ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళుతున్నారని తెలిపారు.
ఇక, ఇరు పార్టీల నుంచి పార్టీకి ముగ్గురు చొప్పున ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. టీడీపీ తరఫున యనమల రామకృష్ణుడు నాయకత్వంలో ముగ్గురు సభ్యులు కమిటీలో ఉంటారని అచ్చెన్నాయుడు వివరించారు.
ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం ఈ నెల 13న ఉంటుందని వెల్లడించారు. జనసేన ప్రతిపాదించిన ఆరు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.