New Zealand: శ్రీలంకను స్వల్ప స్కోరుకు ఆలౌట్ చేసిన న్యూజిలాండ్
- వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్ × శ్రీలంక
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
- 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైన లంక
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... శ్రీలంకను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది.
ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లంక జట్టు ఈ ఇన్నింగ్స్ లో ఏమంత ఆకట్టుకునేలా కనిపించలేదు. 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. అది కూడా ఓపెనర్ కుశాల్ పెరీరా, మహీశ్ తీక్షణ చలవతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.
తొలి పవర్ ప్లేలో ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ కుశాల్ పెరీరా దూకుడుగా ఆడుతూ కేవలం 28 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 2, కెప్టెన్ కుశాల్ మెండిస్ 6, సదీర సమరవిక్రమ 1, చరిత్ అసలంక 8 పరుగులకు అవుటై నిరాశపరిచారు. ఏంజెలో మాథ్యూస్ 16, ధనంజయ డిసిల్వ 19 పరుగులు చేశారు.
అయితే, కివీస్ బౌలర్లకు మహీశ్ తీక్షణ కొరకరాని కొయ్యలా పరిణమించాడు. చివర్లో మొండిగా పోరాడిన తీక్షణ 91 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఆఖరి బ్యాట్స్ మన్ దిల్షాన్ మధుశంక (19) కూడా పోరాడడంతో శ్రీలంక 171 పరుగులు చేయగలిగింది.
కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ హడలెత్తించాడు. తొలి పవర్ ప్లేలో బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టడంతో లంక కోలుకోలేకపోయింది. లాకీ ఫెర్గుసన్ 2, మిచెల్ శాంట్నర్ 2, రచిన్ రవీంద్ర 2, టిమ్ సౌథీ 1 వికెట్ తీశారు.