G. Kishan Reddy: సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాలను తప్పుదోవ పట్టించవద్దు: కిషన్ రెడ్డి హెచ్చరిక
- కొన్ని సంస్థలు సర్వేల పేరుతో రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం
- ఈ నెల 11న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నట్లు వెల్లడి
- ఎన్నికల చివరి నాటికి మరో రెండు మూడు సభల్లో పాల్గొంటారన్న కిషన్ రెడ్డి
ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల చివరి నాటికి మరో రెండు మూడు సభలలో పాల్గొంటారని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా కూడా పలుచోట్ల రోడ్డు షోలలో పాల్గొంటారని తెలిపారు. మరో నాలుగైదు స్థానాలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రోడ్డు షోలో పాల్గొంటారన్నారు.
కాగా, ఎన్నికలకు ముందే కొన్ని సర్వే సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాలను తప్పుదోవపట్టించడం మంచిది కాదని హెచ్చరించారు.
ప్రచారంలో కేంద్రమంత్రులు
ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రులు పాల్గొంటారని బీజేపీ నేత సుభాష్ అన్నారు. మునుగోడు, పాలకుర్తిలలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రచారం చేస్తారని... కొల్లాపూర్, నాగర్ కర్నూల్లో పురుషోత్తం రూపాలా... వరంగల్ తూర్పు, పశ్చిమలో అశ్విని కుమార్ చౌబే ప్రచారం నిర్వహిస్తారన్నారు.