Rachin Ravindra: కివీస్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు దిష్టి తీసిన నాయనమ్మ... వీడియో ఇదిగో!
- వరల్డ్ కప్ లో పరుగుల మోత మోగిస్తున్న రచిన్ రవీంద్ర
- 23 ఏళ్లకే రికార్డుల వేట షురూ
- రచిన్ రవీంద్ర నాయనమ్మ, తాతయ్యల స్వస్థలం బెంగళూరు
- వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరులో నాయనయ్మ ఇంటికి వచ్చిన రచిన్
భారత్ లో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ ద్వారా వెలుగులోకి వచ్చిన యువ ప్రతిభావంతుడు రచిన్ రవీంద్ర. ఈ న్యూజిలాండ్ యువ సంచలనం మెగా టోర్నీలో పరుగులు వెల్లువెత్తించాడు. 9 మ్యాచ్ ల్లో 565 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 2 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు ఉండడం విశేషం. ఈ క్రమంలో 23 ఏళ్ల రచిన్... క్రికెట్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమించాడు. 1996 వరల్డ్ కప్ లో సచిన్ 523 పరుగులు చేయగా, ఇప్పుడా అత్యధిక పరుగుల రికార్డు రచిన్ రవీంద్ర సొంతమైంది.
ఇక, అసలు విషయానికొస్తే... రచిన్ రవీంద్ర భారతీయ మూలాలు కలిగిన న్యూజిలాండ్ పౌరుడు. రచిన్ నానమ్మ, తాతయ్యలు బెంగళూరులో ఉంటారు. రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి చాన్నాళ్ల కిందటే న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. రచిన్ రవీంద్ర తాతయ్య బాలకృష్ణ అడిగా ఓ ప్రముఖ విద్యావేత్త.
వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా రచిన్ రవీంద్ర బెంగళూరు రాగా, తన నాయనమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లాడు. అక్కడ రచిన్ కు నాయనమ్మ పూర్ణిమ దిష్టి తీశారు. తన మనవడి పేరు మార్మోగుతుండడంతో అతడికేమైనా నరదృష్టి సోకుతుందేమోనని ఆమె ఆందోళన చెందారు. అందుకే, అతడ్ని కూర్చోబెట్టి దిష్టి తీసివేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.