Medigadda Barrage: మేడిగడ్డ మరమ్మతులకు ప్రభుత్వం రెడీ.. సముద్రం పాలవుతున్న సాగునీరు
- అక్టోబరు 21న కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్
- ఇంజినీర్ల వైఫల్యం.. డిజైన్ లోపం వల్లేనన్న సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
- వృథాగా పోతున్న 23 టీఎంసీల నీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు అధికారులు రెడీ అయ్యారు. ఇందుకోసం బ్యారేజీలోని నీటిని కిందికి వదిలి ఖాళీ చేస్తున్నారు. అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లోని 20వ నంబర్ పిల్లర్ (పియర్) కుంగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతోపాటు మరో ఆరు పియర్లు కూడా దెబ్బతిన్నాయి. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. ఇంజినీర్ల వైఫల్యంతోపాటు డిజైన్ లోపం వల్లే కుంగినట్టు కేంద్రానికి నివేదిక సమర్పించింది.
మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీలన్నీ ప్రమాదంలో ఉన్నాయని, నీళ్లు నిల్వచేయొద్దని కోరింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డ (లక్ష్మీ), అన్నారం (సరస్వతి) బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. తాజాగా సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 23 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. డ్యాం పూర్తిగా ఖాళీ అయ్యాక మరమ్మతులు చేయనున్నారు.