World Cup: బంగారం లాంటి సెమీస్ చాన్సు మిస్ చేసుకుని... ఇవాళ దక్షిణాఫ్రికాతో తలపడున్న ఆఫ్ఘనిస్థాన్
- వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా × ఆఫ్ఘనిస్థాన్
- అహ్మదాబాద్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
మొన్న ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్థాన్ గెలిచి ఉంటే వరల్డ్ కప్ సమీకరణాలు మరోలా ఉండేవి. ఆఫ్ఘన్ ఆటగాడు ముజీబ్ క్యాచ్ జారవిడవడం, అప్పటికి 33 పరుగుల వ్యక్తిగత స్కోరుమీదున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ ప్రళయకాల రుద్రుడిలా చెలరేగి అజేయంగా 201 పరుగులు చేసి ఆసీస్ ను గెలిపించడం అందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్ లో గెలిచి ఆసీస్ నిబ్బరంగా సెమీస్ చేరింది. అనూహ్య ఓటమితో ఆఫ్ఘన్ బంగారం లాంటి సెమీస్ చాన్సును మిస్ చేసుకుంది.
నిన్న శ్రీలంకపై ఘనవిజయం ద్వారా న్యూజిలాండ్ కూడా దాదాపుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. సాంకేతికంగా చూస్తే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నప్పటికీ, వాస్తవిక దృక్పథంతో చూస్తే అదేమంత సులువైన విషయం కాదు.
పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 287 పరుగుల భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఛేదనకు దిగితే 284 బంతులు మిగిలుండగానే నెగ్గాలి. పాక్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఈ సమీకరణాలు మర్చిపోవడమే మంచిది. ఇక ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి చూస్తే ఆ జట్టు రన్ రేట్ ఇప్పటికీ మైనస్ లోనే ఉంది. దాంతో ఆఫ్ఘన్ జట్టు టోర్నీ నుంచి అనధికారికంగా నిష్క్రమించినట్టే!
ఈ నేపథ్యంలో... నేడు ఆఫ్ఘనిస్థాన్ జట్టు బలమైన దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలుస్తోంది.
ఇప్పటికే దక్షిణాఫ్రికా సెమీస్ చేరిన నేపథ్యంలో, ఆ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆల్ రౌండర్ మార్కో యన్సెన్, స్పిన్నర్ తబ్రైజ్ షంసీలకు విశ్రాంతినిచ్చారు. ఆండిలే ఫెలుక్వాయో, గెరాల్డ్ కోట్జీలకు తుది జట్టులో స్థానం కల్పించారు.
అటు, ఆఫ్ఘనిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. గత మ్యాచ్ లో ఆసీస్ పై ఆడిన జట్టునే నేడు కూడా బరిలో దించుతున్నారు.