gangula kamalakar: కాంగ్రెస్ లేదా బీజేపీ గెలిస్తే కనుక మళ్లీ ఆంధ్రా పెత్తనం వస్తుంది!: గంగుల కమలాకర్
- హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీపై ఆరోపణలు
- కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
- వేరేవారికి అధికారం ఇస్తే ఆగం చేస్తారన్న కమలాకర్
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుకొని హైదరాబాద్‌ను ఆంధ్రాలో కలిపే ప్రయత్నం చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేదా బీజేపీ గెలిస్తే కనుక మళ్లీ ఆంధ్రా పెత్తనం వస్తుందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో మన భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు. తెలంగాణను ఇతరుల చేతుల్లో పెట్టవద్దని, పొరపాటున వేరేవారికి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందన్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైదరాబాద్ సంపద మీద ఆంధ్రా నేతల కన్ను పడిందన్నారు. కేసీఆర్ మళ్లీ గెలవకుంటే ఇక్కడి సంపదను అంతటినీ వారు తీసుకు వెళ్తారన్నారు. వెలుగులు విరజిమ్ముతున్న తెలంగాణను మళ్లీ గుడ్డి దీపంగా మార్చుతారన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేసి కేసీఆర్‌కు పట్టం కట్టాలన్నారు. తెలంగాణ రాకముందు విద్యుత్, నీళ్లు, పెంఛన్ వచ్చేవి కాదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. తెలంగాణ వచ్చాక కరెంట్, నీళ్లు, నిధులు వస్తున్నాయన్నారు.