bjp: వేములవాడకు అభ్యర్థి మార్పు... ఆవేదనతో కంటతడి పెట్టిన తుల ఉమ
- వేములవాడ నుంచి తొలుత తుల ఉమ పేరు ప్రకటన... ఈ రోజు వికాస్ రావుకు బీఫామ్
- బీసీలకు, మహిళలకు బీజేపీలో ప్రాధాన్యత లేదని ఆగ్రహం
- తన పేరు ప్రకటించి, కిషన్ రెడ్డి ఫోన్ చేసి పని చేసుకోమని చెప్పి ఇలా చేశారని ఆవేదన
ఆఖరి నిమిషంలో తనకు బీజేపీ వేములవాడ అసెంబ్లీ బీ ఫామ్ నిరాకరించడంతో తుల ఉమ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నియోజకవర్గానికి తొలుత తుల ఉమ పేరును ప్రకటించారు. కానీ ఈ రోజు బీ ఫామ్ మాత్రం వికాస్ రావుకు ఇచ్చారు. దీంతో ఆమె కంటతడి పెట్టారు. తాను ఉద్యమంలో పని చేశానని, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన కోసం కొట్లాడానని, అలాంటి తనకు టిక్కెట్ రాలేదన్నారు. తాను దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశానన్నారు. బీసీలకు, మహిళలకు బీజేపీలో ప్రాధాన్యత లేదని ఆమె విమర్శించారు.
డబ్బుల సంచులు పట్టుకొచ్చిన వారికి, పెద్దవారికి టిక్కెట్ ఇస్తున్నారన్నారు. సామాన్యులకు, గెలిచే తమలాంటి వారికి టిక్కెట్ నిరాకరించారన్నారు. అభ్యర్థిని మార్చిన అంశంపై కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. మొదట తన పేరును ప్రకటించారని, కిషన్ రెడ్డి కూడా తనకు ఫోన్ చేసి మీరు గెలుస్తారు, బాగా పని చేయండని చెప్పారని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు బీఫామ్ వేరేవారికి ఇచ్చారన్నారు. వేములవాడ బరిలో కచ్చితంగా ఉంటానని.. బీజేపీ బీసీ, మహిళా నినాదమంతా బోగస్ అని ఆమె అన్నారు.