Afghanistan: మెరిసిన ఒమర్జాయ్... ఆఫ్ఘన్ గౌరవప్రద స్కోరు
- వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా × ఆఫ్ఘనిస్థాన్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
- 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్
- 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఒమర్జాయ్
బలమైన దక్షిణాఫ్రికాతో వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ లీగ్ పోరులో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆఫ్ఘన్ మిడిలార్డర్ బ్యాటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ 97 పరుగులతో రాణించడం ఈ ఇన్నింగ్స్ లో హైలైట్ అని చెప్పాలి. ఒమర్జాయ్ 107 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఒమర్జాయ్ ఎంతో సహనంతో ఆడి జట్టుకు ఓ మోస్తరు స్కోరు వచ్చేందుకు దోహదపడ్డాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ రబాడా బంతులను ఎదుర్కోవడంలో ఒమర్జాయ్ తడబాటుకు గురయ్యాడు. ఒమర్జాయ్ అజేయంగా నిలిచినప్పటికీ ఆ ఓవర్లో చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఓ పరుగు తీసేయత్నంలో నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న నవీనుల్ హక్ (2) రనౌట్ అయ్యాడు.
ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (25), ఇబ్రహీం జాద్రాన్ (15) తొలి వికెట్ కు 41 పరుగులు జోడించి ఫర్వాలేదనిపించారు. రహ్మత్ షా 26, నూర్ అహ్మద్ 26 పరుగులు చేశారు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (2), మహ్మద్ నబీ (2) నిరాశపరిచారు.