Vidadala Rajini: జగన్ ను మళ్లీ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది: మంత్రి విడదల రజనీ
- బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి జగన్ అన్న రజనీ
- ఎన్నో సంక్షోమ పథకాలను అమలు చేస్తున్నారని కితాబు
- ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారయ్యాయని వ్యాఖ్య
బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ మంత్రి విడదల రజనీ కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను రాష్ట్రానికి నాలుగు దిక్కులుగా జగన్ భావిస్తారని చెప్పారు. బలహీన వర్గాలకు ఆత్మబంధువైన జగన్ ను మళ్లీ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, విద్యా కానుక వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు తయారయ్యాయని తెలిపారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పారు. 3 వేలకు పైగా వ్యాధులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేశామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మహిషాసురుని సంహరిస్తే దసరా చేసుకుంటామని... నరకాసురిని సంహరిస్తే దీపావళి చేస్తామని... తరతరాలుగా కొనసాగుతున్న అణచివేతను సంహరిస్తే అది సామాజిక సాధికార యాత్ర అని అన్నారు. పల్నాడు జిల్లాలో కొనసాగిన సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర సందర్భంగా మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.