World Cup: ఓటమితో వరల్డ్ కప్ ప్రస్థానాన్ని ముగించిన ఆఫ్ఘనిస్థాన్
- ఆఫ్ఘనిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా
- 245 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో ఛేదించిన సఫారీలు
- కీలక ఇన్నింగ్స్ ఆడిన వాన్ డర్ డుసెన్
భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో సంచలన విజయాలతో అందరినీ అలరించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ లో ఓటమిపాలైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ జట్టుపై గెలిచింది.
ఆఫ్ఘన్ జట్టు నిర్దేశించిన 245 పరుగుల విజయలక్ష్యాన్ని సఫారీలు 47.3 ఓవర్లలో ఛేదించారు. వాన్ డర్ డుసెన్ 76 పరుగులతో అజేయంగా నిలిచి దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్పిన్ తో ఒత్తిడి పెంచేందుకు ఆఫ్ఘన్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, డుసెన్ అద్భుతంగా ప్రతిఘటించి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. చివర్లో ఆండిలె ఫెలుక్వాయో 39 (నాటౌట్) ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఓపెనర్ క్వింటన్ డికాక్ 41, కెప్టెన్ టెంబా బవుమా 23, ఐడెన్ మార్ క్రమ్ 25, డేవిడ్ మిల్లర్ 24 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 2, ముజీబ్ 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ అత్యధిక డిస్మిసల్స్ తో వరల్డ్ కప్ రికార్డును సమం చేశాడు. ఒకే ఇన్నింగ్స్ లో ఆరు క్యాచ్ లు పట్టి... ఆడమ్ గిల్ క్రిస్ట్ (ఆస్ట్రేలియా), సర్ఫరాజ్ (పాకిస్థాన్)ల సరసన చేరాడు.
కాగా, రేపు వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్, పాకిస్థాన్-ఇంగ్లండ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఎల్లుండి టీమిండియా... నెదర్లాండ్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ పూర్తయితే గానీ సెమీస్ లో ఎవరు ఎవరితో ఆడతారన్నది స్పష్టం కాదు. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న జట్టు నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తొలి సెమీఫైనల్లో తలపడుతుంది. ఇక రెండో సెమీఫైనల్లో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు తలపడతాయి.